AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పొంగులేటి చెప్పినట్లే జరిగింది.. నిన్న చెప్పాడు.. నేడు జరిగింది!

కాంగ్రెస్ నేత పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు
కాంగ్రెస్ నేత, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే జరిగింది. ఐటీ అధికారులు పొంగులేటి నివాసంలో సోదాలు చేస్తున్నారు. గురువారం వేకువజామున 3 గంటల నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాల్లో సోదాలు మొదలయ్యాయి. మొత్తం 8 వాహనాల్లో అధికారులు పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. మొదట సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.

బుధవారం కీలక నేత తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసులు, ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. ఖమ్మంలో ఆయనకు చెందిన రెండు నివాసాల్లో పోలీసులు దాడులు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 వేల బోగస్ ఓట్లను చేర్పించారని మంత్రి పువ్వాడ అజయ్‌పై తుమ్మల ఆరోపించారు. ఆ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

ఈ దాడుల గురించి నిన్న (నవంబర్ 8) మీడియాతో మాట్లాడిన పొంగులేటి కేంద్ర దర్యాప్తు సంస్థలైనా, ఐటీ, ఈడి దాడులపై కీలక కామెంట్స్ చేశారు. తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ సోదాలకు ఆస్కారం ఉందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులు కొన్ని రోజులు తప్పవని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఆయన ఇలా చెప్పిన మరుసటి రోజే ఐటీ దాడులు జరగటం కలకలం రేపుతోంది.

ANN TOP 10