నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం దంచికొట్టింది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ ప్రాంతాలతో పాటు ప్రగతినగర్, బాచుపల్లి, ముసాపేట్ ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. కేపీహెచ్‌బీ వద్ద రహదారిపై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. కుకట్‌పల్లిలో సుమారు రెండు కిలోమీటర్లు వరకు వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలైన సూరారం, బహదూర్ పల్లి, సుచిత్ర, కొంపల్లి, చింతల్, బాలానగర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు రహదారులు జలమయమైయ్యాయి. సాయంత్రం సమయం వర్షం పడటంతో ఉద్యోగస్థులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మంగళవారం కూడా సాయంత్రం నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మంగళవారంనాడు అత్యధికంగా భద్రాద్రి-కొత్తగూడెంలోని మద్దుకూరులో 10 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరిలోని నారాయణపూర్‌లో 7.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి, లింగంపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది.
మరో మూడు రోజులు వర్షాలే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.









