కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి కేసుకు సంబంధించి సిద్దిపేట సీపీ కీలక విషయాలను వెల్లడించారు. సంచలనం సృష్టించి.. రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందేందుకే ఎంపీపై రాజు హత్యాయత్నం చేశాడని తెలిపారు. వారం రోజుల పాటు అదును కోసం చూసి.. పక్కా పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలకు చెందిన గటని రాజు.. పలు ఆన్‌లైన్ చానెళ్లలో పనిచేశాడు. విలేకరి ముసులో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. ఆ సొమ్మును జల్సాలకు వాడేవాడు. ఈ క్రమంలోనే సంచలనం కోసం ఎంపీని హత్య చేసేందుకు కుట్ర చేశాడు. దుబ్బాక మార్కెట్లో కత్తిని కొని.. కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో రెక్కీ చేశాడు. అనంతరం అక్టోబరు 30న సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎంపీపై అటాక్ చేశాడు.
కార్యకర్త ముసుగులో రాజు.. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి అతి సమీపంలోకి వచ్చి కత్తితో పొడిచాడు. అతడిని బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకొని చితకబాదారు. ఘటన జరిగిన వెంటనే కొత్త ప్రభాకర్ రెడ్డిని.. గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. యశోదా ఆస్పత్రి వైద్యులు ఎంపీకి ఆపరేషన్ చేసి 10 సెంటీమీటర్ల మేర పేగును తొలగించారు. లోపల రకస్త్రావమైందని… మూడు అంగుళా మేర కత్తి దిగిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో కొత్త ప్రభాకర్‌కు చికిత్స కొనసాగుతోంది.
కాగా, నిందితుడు రాజుకు రాజకీయ సంబంధాలు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడని ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ కోణం లేదన్నట్లుగా చెప్పారు. సంచలనం కోసం రాజు ఈ పనిచేశాడని వెల్లడించారు.