నటుడు వరుణ్ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి వివాహంలో మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబ సభ్యులంతా తెగ సందడి చేస్తున్నారు. ఇటలీలోని టస్కానీలో జరిగిన ఈ పెండ్లి వేడుకకు కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందినవారంతా హాజరయ్యారు. నవదంపతులను ఆశీర్వదించారు. ఇక పెండ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవదంపతులు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలకు సినీ సెలబ్రిటీల నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘‘..ఆ విధంగా వారు ప్రేమతో నిండిన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. నవ తారల దంపతులకు తారల శుభాకాంక్షలు!’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కొత్త జంట వరుణ్-లావణ్యతో మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి దిగిన ఒక ఫొటోని ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఉన్నారు. దీంతో ఈ ఫొటోని చూసి మెగా ఫ్యామిలీ అభిమానుల మురిసిపోతున్నారు. ఇదిలావుండగా ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాడు. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు.