AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం..

భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిని అభినవ చాణక్యగా అభివర్ణించారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో (Oxford University) ‘ఎక్స్‌ప్లోరింగ్‌ ఇన్‌క్లూసివ్‌ డెవలప్‌మెంట్‌-ది తెలంగాణ మాడల్‌’ అనే అంశంపై కవిత కీలకోపన్యాసం
చేశారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ.. సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి స్ఫూర్తినిచ్చారన్నారు.

ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని అన్నారు. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని.. అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపారని వివరించారు.

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేసీఆర్‌తో సఫలం అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ పోరాటం సాగిందని, చివరికి 2001లో కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చిందని గుర్తుచేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని చెప్పారు.

అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 వెనుకబడి ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండేదని ప్రస్తావించారు. 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేదని, విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారని స్పష్టం చేశారు. విద్యుత్‌ మిగులు సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరిందన్నారు.

ANN TOP 10