సహజీవనం.. పాశ్చాత్యదేశాలకే పరిమితమనుకున్న ఈ సంస్కృతి ఖండాంతరాలు దాటి భారతదేశంలోనూ విస్తరించి చివరికి అదొక ట్రెండ్‌గా మారిపోయింది. కానీ ఈ సహజీవనం అనేది పాశ్చాత్యదేశాలకంటే ముందే భారతదేశంలో ఓ సంప్రదాయమని మీకు తెలుసా? అవును పెళ్లికి ముందే నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడం.. చివరివరకూ బంధం కొనసాగుతుంది అనే నమ్మకం కలిగితే వివాహం.. లేదంటే ఆ బంధానికి అంతటితో గుడ్‌బై చెప్పేయడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారతదేశంలోని కొన్ని గిరిజన తెగలు ఈ సహజీవనాన్ని ఆచారంగా పాటిస్తారు. ఈ ఆచారం ఎక్కడో..ఎవరు పాటిస్తారో తెలుసుకుందాం..
తెలిసి తెలిసి సహజీవనాన్ని ఏ తల్లిదండ్రులూ అంగీకరించరు. పైగా పెళ్లికి ముందే మరో వ్యక్తితో కలిసుండడాన్ని తప్పు పడుతుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మరియా తెగ ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడ స్వయంగా తల్లిదండ్రులే పిల్లలను సహజీవనానికి ప్రోత్సహిస్తారు. గ్రామస్తులతో కలిసి ఇష్టపడిన యువతీ యువకుల కోసం ఓ గుడిసెను ఏర్పాటు చేస్తారు. యువతీయువకులు అక్కడ చేరతారు. యువకుడు వెదురుతో దువ్వెనలు తయారు చేస్తారు. వాటిలో తనకు నచ్చినయువకుడు తయారు చేసిన దువ్వెనను యువతి దొంగిలిస్తుంది. అప్పుడు వారిద్దరూ కొన్నాళ్లు ఆ గుడిసెలో సహజీవనం చేస్తారు. అనంతరం ఓ శుభముహూర్తంలో పెద్దలు వారికి వివాహం చేస్తారు. ఈ తరహా వివాహాల వల్ల అక్కడ విడాకుల రేట్ చాలావరకు తగ్గిందని స్థానికులు చెబుతున్నారు.









