మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
గ్యారంటీ పథకాలన్నీ అమలు చేస్తాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యారంటీ పథకాలన్నీ అమలు చేసామని జానారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. బెల్ట్ షాప్ లు ఎత్తివేస్తామని అన్నారు. మద్యం తాగే వారికి కోపం వచ్చినా సరే బెల్ట్ షాప్ లు తీసేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్లకు బీఆర్‌ఎస్ ఇచ్చే రూ.1000 కావాలో లేదా సోనియా గాంధీ ఇంట్లో ప్రతి మహిళకు ఇస్తానన్న రూ.2500 కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.4వేల పెన్షన్ ఇస్తామని సోనియా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
సోనియా గాంధీ గ్యాస్ సిలిండర్ రూ.500 కే ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. సోనియా గాంధీ చెప్పిన తర్వాత కేసీఆర్ రూ.400 కే ఇస్తామన్నారని తెలిపారు. ఈ నాలుగేళ్ళు ఎందుకు ఇవ్వలేదో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని వెల్లడిరచారు. రైతులకు ఎకరానికి రూ.15వేలు, కౌలు రైతుకు రూ.12వేలు ఇస్తామని చెప్పారు.
అలాగే వరి పండిస్తే 500 రూపాయల బోనస్ అందిస్తామని చెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల కార్డు ఇస్తామని తెలిపారు. ఆరోగ్య లక్ష్మి కింద రూ.10 లక్షల వరకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చన్నారు. వీటన్నింటినీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని అన్నారు.









