యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో విజయదశమి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకం, అర్చనలు నిర్వహించారు. ప్రాకార మండపంలో సుదర్శనహోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ ఉత్సవమూర్తులను, పట్టు వస్త్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంక రించి ఊరేగింపుగా ప్రధానాలయ తూర్పు రాజగోపురం వద్దకు చేర్చారు. జమ్మి చెట్టుకు అర్చక బృందం వేద పండి తులు పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో పూజలను నిర్వహించారు.
ఈ విశేష పూజల్లో అలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. యాదగిరికొండపైన మంగళవారం యాత్రాజనుల సందడి కొనసాగింది. దసరా సెలవులు ముగియనుండడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావటంతో ఆలయ తిరువీధులు, సేవా మండపాలు దర్శనక్యూలైన్లతో పాటు కొండపైన, కొండ కింద బస్టాండ్ ప్రాంతాలు కోలాహలంగా కనిపించాయి. స్వామివారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టింది. సుమారు 25వేల మందికి పైగా భక్తులు నృసింహుడిని దర్శించుకోగా, ఆలయ ఖజానా కు వివిధ విభాగాల ద్వారా రూ.25,73,422 ఆదాయం సమకూరింది.









