బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తుఫాన్‌గా మారింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్- రాత్రి 11:30 గంటల సమయానికి ఒడిశాలోని పారాదీప్ తీరానికి ఆగ్నేయ దిశగా 200 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ దిశగా 290 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా తీరానికి నైరుతి దిశగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని వేగం గంటకు 18 కిలోమీటర్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా- చిట్టాగాంగ్ మధ్య తీరాన్ని దాటుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 25వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షలు కురుస్తాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం సాయంత్రం రాజధాని కోల్‌కతలో భారీవర్షం కురిసింది. కోల్‌కతతో పాటు దక్షిణ 24 పరగణా, దిఘా, హుగ్లీ, మేదినిపూర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
ఒడిశా ఉత్తర ప్రాంతంలోని కేంద్రపారా, భద్రక్, మయూర్ భంజ్, బాలాసోర్.. జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడ్డాయి. ఏపీపై ఈ తుఫాన్ ప్రభావం పెద్దగా పడ లేదు. హమూన్ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్‌లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.