భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా సౌకర్యాన్ని సాధ్యమైనంత తక్కువ ధరకే ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. కూలీలు, పేదల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ రైళ్లలో 22 నుంచి 26 కోచ్‌లు ఉంటాయి. జనతా ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. కార్మికుల కోసమే ప్రత్యేకంగా నడుపుతారు. ఏయే రాష్ట్రాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వచ్చారు? రైల్వే ఏ స్టేషన్ల నుంచి ఏ స్టేషన్ల వరకు రైళ్లు నడపాల్సి ఉంటుంది? తదితర విషయాలపై ఒక అవగాహనకు వచ్చారు. 2024 ఆర్థిక సంవత్సరాంతానికి ఇవి ప్రారంభం కానున్నాయి. జనరల్, స్లీపర్ కోచ్ లే ఉంటాయి.
సాధారణ రైళ్లకంటే వీటిల్లో ఇంకా తక్కువ ఛార్జీలుంటాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అస్సాం, గుజరాత్, ఢిల్లీ మధ్య నడుస్తాయి. అధిక సంఖ్యలో కార్మికులు, చేతివృత్తులవారు, ఇతర వ్యక్తులు ఈ రాష్ట్రాల నుంచి వచ్చి తిరిగి ఇంటికి వెళుతుంటారు. ముస్లింలు తయారుచేసే రావణ ప్రతిమలు.. ఎక్కడో తెలుసా..? నివేదికల ప్రకారం.. వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ప్రయాణించే నగరాల్లో వీటిని నడపబోతున్నారు. దీనివల్ల వారికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉంటుందని భావిస్తున్నారు. పండగలు, రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో నడిపే రైళ్లకు, వీటికి తేడా ఉందని, వీటిని ఏడాది పొడవునా నడుపుతామని అధికారులు తెలిపారు. అలాగే జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి అత్యంత తక్కువ ధరకే ఆహారాన్ని, నీటిని అందించాలని నిర్ణయించారు. వీటికోసం జనరల్ బోగీలే ఆగే ప్రదేశంలో జనతా ఖానా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటి ధరలు రూ.20, రూ.50గా ఉండనున్నాయి.