AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడిగడ్డ ఘటనపై బీఆర్‌ఎస్‌ జవాబేదీ?

అనూహ్యంగా తెర మీదకు వచ్చిన మేడిగడ్డ ప్రాజెక్టు ఉదంతం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. వేలాది కోట్ల రూపాయిలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు పని తీరుపై సందేహాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి. కీలకమైన ఎన్నికల వేళ.. ఇష్యూగా మారిన మేడిగడ్డ మీద మాట్లాడే విషయంలో గులాబీదళం ఉక్కిరిబిక్కిరికి లోనవుతోంది. ఏం మాట్లాడితే ఏమవుతుందన్న సందేహంతో మౌనంగా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తోంది. రూ.లక్షన్నర కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు దెబ్బ తినటం దేనికి నిదర్శనం? అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని.. విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. అంచనాలు భారీగా పెంచి నిర్మించిన ప్రాజెక్టుల్లో లోపాలు బయటపడుతున్నాయని విరుచుకుపడుతున్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్‌ కమిషన్‌ తో విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు రేవంత్‌ రెడ్డి. కాళేశ్వరం అవినీతిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర మంత్రులు అమిత్‌ షాలు చెప్పారని.. మరిప్పుడైనా విచారణకు ఆదేశిస్తారా?అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి నీటిపారుదల శాఖ కేసీఆర్‌.. ఆయన కుటుంబ సభ్యుల వద్దనే ఉన్నందున కాళేశ్వరంలో తప్పిదాలకు వారి కుటుంబాన్నే మొదటి ముద్దాయిగా చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డ్యాం సేఫ్టీ అథారిటీతో పరిశీలన చేయించాలన్న డిమాండ్లు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై తాను కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి ద్రష్టికి తీసుకెళ్లనున్నట్లుగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్లకే పిల్లర్లు కుంగిపోవటం దారుణమన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తాము అడుగుతున్న సందేహాలకు ఎందుకు సమాధానాలు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మేడగడ్డపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీ నేతలు మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళితే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. పిల్లర్‌ కుంగుబాటు చిన్నదేనని.. ఒకటి మాత్రమే దెబ్బ తిందని చెబుతున్నా.. 15 నుంచి 22వ పిల్లర్‌ వరకు దెబ్బ తిన్నట్లుగా తెలుస్తోందని ఈటల రాజేందర్‌ ఆరోపిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అద్భుతమని చెప్పే కేసీఆర్‌.. కేటీఆర్‌.. కుంగుబాటు మీద ఏమని జవాబు చెబుతారని భట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. నాణ్యత లోపంతోనే మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయిందని కోదండరాం ఆరోపించారు. ఈ అంశంపై న్యాయవిచారణకు కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. తాజా పరిణామాలపై విపక్షాలు ఒక రేంజ్‌ లో విరుచుకుపడుతుంటే.. కనీసం కౌంటర్‌ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గులాబీ దళం నిలిచింది.

ANN TOP 10