భారత క్రికెట్ దిగ్గజం, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. తన ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ తో ఆయన క్రీడాభిమానులకు ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించారు. బిషన్ సింగ్ బేడీ భారత్ తరఫున 1966 నుంచి 1979 వరకు ఆడారు. 67 టెస్టుల్లో 266 వికెట్లు తీశారు.
బిషన్ సింగ్ బేడీ (Bishan singh Bedi) 22 మ్యాచ్లకు కెప్టెన్గానూ వ్యవహరించారు. 10 వన్డేల్లో ఆడి 7 వికెట్లు తీశారు. అప్పట్లో భారత్ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ప్రసిద్ధిగాంచారు. స్పిన్ బౌలింగ్ రివల్యూషన్ రూపశిల్పులలో ఒకరిగా క్రికెట్లో తనదైన ముద్ర వేశారు. బిషన్ సింగ్ బేడీ 1976లో పంజాబ్లోని అమృత్ సర్ లో జన్మించారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
భారత్ తొలి వన్డే విజయంలో ఎరపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్. వెంకటరాఘవన్ తో కలసి కీలక పాత్ర పోషించారు. 1975 ప్రపంచ కప్ లో భాగంగా ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (12-8-6-1)తో ఆ జట్టును 120 పరుగులకే కట్టడి చేశారు. క్రికెట్లో ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970లో పద్మశ్రీ పురస్కారం అందించి గౌరవించింది. 2004 సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. మణిందర్ సింగ్, మురళీ కార్తీక్ వంటి స్పిన్నర్స్ ను తీర్చిదిద్దారు.
ఆయన మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున గార్గేలు విచారణ వ్యక్తం చేశారు. ఆయన సేవలను గుర్తు చేసుకొని, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.