ఖమ్మం జిల్లా: విజయ దశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రచార కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మిచ్చిన కాంగ్రెస్ (Congress)కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే నెల 30న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓట్లు వేసి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలుపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, పాలేరు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం వచ్చాక మొదటి వంద రోజుల్లోనే ప్రతినెల ఆడబిడ్డలకు రూ.2500 ఇస్తామన్నారు. ఇప్పుడు రూ.12 వందలు ఉన్న గ్యాస్ రూ.5 వందలకే కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు.
మహిళలకు ఉచితంగా బస్సు ఛార్జ్‌లు లేకుండా ప్రయాణం చేయవచ్చునని, ఇల్లు లేని పేదలకు రూ.5లక్షలతో ఇల్లు కట్టించడం జరుగుతుందని, రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15వేలు, భూమిలేని రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు రూ.10 లక్షలతో వైద్యం.. నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు.. ఉద్యమ కారులకు ఇళ్ల స్థలం ఇస్తామని, రైతు రుణమాఫీ రూ.2 లక్షలు ఒకేసారి చేస్తామని ప్రకటించారు. తొమ్మిదన్నరేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో ప్రజలకు తెలుసునని, మళ్ళీ ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇస్తే మనకు మిగిలేది బూడిదేనన్నారు. తన గురించి మీకు తెలుసునని, అధికారంలో ఉన్నా లేకపోయినా మీతోనే మీ కుటుంభంలో ఒకడిగా ఉన్నానని, తాను ఎవరిని విమర్శించనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలేరుతో పాటు ఖమ్మం జిల్లాని అభివృద్ధి పథంలో ఉంచుతామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.