AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకు ముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.

అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు.. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామివారి శిష్య‌బృందం పఠించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10