విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారు శనివారం మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. శంఖు చక్రాలను చేతపట్టి భక్తులకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తున్నట్లు తీర్చిదిద్దిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేసారు.
మరోపక్క రాజశ్యామల ఆలయంలో శ్రీచక్రానికి పండితులు నవావరణార్చన నిర్వహించారు. భక్తులకు భోగభాగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ శ్రీమత్ దేవీ భాగవతాన్ని పారాయణ చేసారు. రాజశ్యామలా సమేత చంద్రమౌళీశ్వరులకు స్వాత్మానందేంద్ర స్వామి చేతులమీదుగా సాగిన దేవతార్చన భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.
సంప్రదాయాన్ని అనుసరించి పీఠ ప్రాంగణంలో బాల పూజ నిర్వహించారు. పసిపిల్లల పాదాలకు పసుపు పారాయణతో ఈ పూజ చేసారు. శ్రీసూక్త ప్రదానంగా బాల పూజ జరిగింది. పోణంగి లక్ష్మీ సేవ్య సంహిత, వడ్డాది లక్ష్మీ భార్గవి ఇందులో పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి బాల పూజ నిర్వహించే సంప్రదాయం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న పిల్లలతో స్వరూపానందేంద్ర స్వామి అక్షరాలు దిద్దించారు.









