సద్దుల బతుకమ్మ సంబరాలకు వేళయింది.. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్న ఆడ పడుచులు చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకోనున్నారు. గౌరమ్మ నిమజ్జనానికి సిద్ధమయ్యారు.. పూలను సేకరించి సద్దుల బతుకమ్మ సంబరాలకు సిద్ధం చేస్తున్నారు.
ప్రతి ఏటా అమావాస్యరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభమయ్యే బతుకమ్మ వేడుకలు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలతో ముగుస్తాయి. సద్దుల సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించి బతుకమ్మను నిమజ్జనం చేయడం ఆనవాయితీ.
బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు నిర్వహించుకోవడం తెలంగాణ సాంప్రదాయం.. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవరోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవరోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవరోజు అలిగిన బతుకమ్మ, ఏడవరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించి బతుకమ్మను నిమజ్జనం చేయడమే ఈ ఉత్సవాల ప్రత్యేకత..









