అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించగా, బీజేపీ మాజీ ఎంపీ గడ్డం వివేకానంద పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.
చెన్నూరు బీఆర్‌ఎస్‌లో అసమ్మతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హస్తం గూటికి చేరగా, ఆయన బాటలోనే మరికొందరు పయనించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్ కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఉంది. అప్పట్లోనే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకోగా, చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాహాటంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు మొదటి నుంచి బాల్క సుమన్ నియోజక వర్గంలోని ఇతర నాయకులను దూరం పెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాల్క సుమన్‌తో విబేధించలేక, అంతర్గతంగా మదనపడుతున్న బీఆర్‌ఎస్ నాయకులు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో బీఆర్‌ఎస్‌ను వీడాలనే ఆలోచనతో వారు ఉన్నట్లు సమాచారం.