ఐఐటీ చదువుతోన్న ఓ విద్యార్ధి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోర్సులో భాగంగా సమర్పించాల్సిన ప్రాజెక్టు విషయంలో మనస్తాపానికి చెందిన విద్యార్ధి హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కె కిరణ్‌చంద్ర (21) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఐఐటీ చదువుతున్నాడు. కిరణ్ చంద్ర తూప్రాన్‌కు చెందిన కేతావత్ చందర్, అనిత దంపతుల కుమారుడు. అతని తండ్రి చందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అనిత ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. ఈ దంపతులకు కిరణ్‌తోపాటు మరో కుమారుడు పవన్, కుమార్తె చైతన్య ఉన్నారు.
కిరణ్ ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్నాడు. అన్న పవన్ కూడా అదే కాలేజీలో ఐఐటీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చెల్లెలు చైతన్య కొంపల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతోంది. ఇదిలా ఉండగా కిరణ్ తన హాస్టల్ గదిలో మంగళవారం (అక్టోబర్ 17) రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి కొన ఊపిరితో ఉన్న కిరణ్‌ను స్థానికంగా ఉన్న బీసీ రాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స అందిస్తుండగా కిరణ్ మృతి చెందాడు.
కిరణ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఆ రాత్రే విమానంలో కాలేజీకి చేరుకున్నారు. కుమారుడి మృతదేహం పట్టుకుని గుండెలవిసేలా విలపించారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న కిరణ్‌కు గత నెలలో హైదరాబాద్‌లో ఆపరేషన్ కూడా చేయించామని.. కోలుకుని ఈ నెల 4న ఖరగ్‌పూర్ ఐఐటీకి వెచ్చాడని, రెండు వారాలకే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ కుమారుడి మరణం వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులను కోరారు.