AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గెలుస్తాం.. హామీలు నెరవేరుస్తాం..

‘ఇదే కరీంనగర్‌లో 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చారు. 2014లో తెలంగాణాను ఇచ్చి ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేశాం.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది… ఆ తర్వాత ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌ గెలుస్తుంది… మేము చెప్పిన ఆరు గ్యారంటీలు తప్పక నెరవేర్చుతాం’ అని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. గురువారం టీపీసీసీ చేపట్టిన కాంగ్రెస్‌ విజయభేరి యాత్రలో భాగంగా కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకున్న రాహుల్‌గాంధీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆయన కరీంనగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. రాజీవ్‌చౌక్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ దేశంలో అత్యంత అవినీతిపరుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పరస్పరం మద్దతు ఇచ్చుకుంటున్నాయని, అందుకే కేసీఆర్‌ ఎంత అవినీతికి పాల్పడ్డా కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసూ పెట్టడం లేదన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకవైపు ఉంటే.. కాంగ్రెస్‌ ప్రజల వైపు ఉందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతామని, తమ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ప్రతినెలా వారి ఖాతాల్లో 2,500 రూపాయలు జమచేస్తామని తెలిపారు. 500 రూపాయలకే వంటగ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని, రైతులకు 15 వేలు, రైతు కూలీలకు 12వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. యువ వికాస్‌ కింద యువత, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ కల్పించేందుకు ఐదు లక్షలను విద్యాభరోసా పథకం కింద అందిస్తామన్నారు. తమ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని, బీజేపీ వారు తన మీద కేసులు పెట్టి ఇల్లు ఖాళీ చేయించారని, లోక్‌సభ సభ్యత్వం రద్దు కోసం కేసు వేశారని తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించాలి, కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్‌లో రాహుల్‌గాంధీ బస:
కాంగ్రెస్‌ విజయభేరి యాత్రలో భాగంగా కరీంనగర్‌కు చేరుకొని రాజీవ్‌చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్న రాహుల్‌గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి ఓ ప్రైవేట్‌ హోటల్‌కు వెళ్ళి అక్కడే బస చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హోటల్‌లో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిని కలిశారు. శుక్రవారం ఉదయం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం జగిత్యాలలో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10