సెక్యూరిటీ డిపాజిట్ జప్తు అయ్యింది. డిపాజిట్ దక్కలేదు.. ఎన్నికల సమయంలో మీరు ఈ మాటలు చాలాసార్లు విని ఉంటారు. అయితే దాని అసలు అర్థం ఏంటో మనలో చాలా మందికి తెలియదు. డిపాజిట్ ఎలా.. ఏ సమయంలో ఎందుకు జప్తు చేస్తారో తెలుసా.. మరీ ముఖ్యంగా, అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న దాన్ని బట్టి అతని సెక్యూరిటీ డిపాజిట్ జప్తు అవుతుందని మీకు తెలుసా. ఏ ఎన్నికలలో ఒక అభ్యర్థికి సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడిందంటే దాని అర్థం ఏంటి..? ఎన్ని ఓట్లు వస్తాయో ఈ కథనంలో ఈ రోజు మనం తెలుసుకుందాం..
వాస్తవానికి, అభ్యర్థి ఏదైనా ఎన్నికలలో నిలబడితే.. అతను ఎన్నికల కమిషన్‌లో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉటుంది. దీన్నే సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దీన్ని సీరియస్‌గా తీసుకునేందుకే ఇలా జరుగుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్నఎంటంటే.. ఈ మొత్తం ఎంత ఉంటుంది. ప్రతి ఎన్నికలకు వేర్వేరు సెక్యూరిటీ అమౌంట్ ఉంటుందా..? ఎంత వరకు ఉంటుందనే వివరాలను ఇక్కడ చూద్దాం..
ఏ ఎన్నికలకు ఎంత సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందంటే..
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో అనేక రకాల ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల, వేర్వేరు ఎన్నికలలో వేర్వేరు డిపాజిట్ మొత్తం ఉంటుంది. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నిర్దిష్ట మొత్తాన్ని ఎన్నికల సంఘం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని సెక్యూరిటీ మొత్తం అంటారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 34, 1 (A) ప్రకారం.. సాధారణ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.25,000, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.10,000 డిపాజిట్ చేయడం తప్పనిసరి. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 34(1)(బి) ప్రకారం, ఈ రెండు ఎన్నికల్లోనూ SC/ST అభ్యర్థులు సగం మొత్తాన్ని మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఎన్నికల కమిషన్ వద్ద డిపాజిట్ చేసిన ఈ మొత్తాన్ని ఎన్నికల సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ సెక్యూరిటీ మొత్తాన్ని రూ.15,000గా నిర్ణయించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల డిపాజిట్లు వేరు వేరుగా ఉంటాయి.
ఎప్పుడు జప్తు అవుతుందంటే..
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 158 వివిధ ఎన్నికలలో అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేయడం, తిరిగి ఇచ్చే పరిస్థితిని పేర్కొంటుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 1/6 శాతం ఓట్లు రాకపోతే ఆ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు అవుతుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది.
సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడు తిరిగి వస్తుందంటే..
అభ్యర్థి నామినేషన్ ఫారమ్ తిరస్కరించబడినా లేదా అతను తన నామినేషన్ ఉపసంహరించుకున్నా.. అతని సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి చెల్లించబడుతుంది. ఇది కాకుండా, ఓటింగ్ ప్రారంభానికి ముందు అభ్యర్థి మరణించినా సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి చెల్లించబడుతుంది. అభ్యర్థి ఎన్నికలలో గెలవకపోయినా చెల్లుబాటు అయ్యే ఓట్లలో 1/6 శాతం వస్తే అతని సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వబడుతుంది. ఇది కాకుండా, గెలిచిన అభ్యర్థికి సెక్యూరిటీ డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వబడుతుంది.