AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాసర సరస్వతి ఆలయంలో మాజీ సీజేఐ పూజలు.. మనవరాలికి అక్షరాభ్యాసం

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. సరస్వతి దేవికి కుంకుమార్చన, మహాహారతితోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మనవరాలు నిత్యశ్రీకి బాసరలో జస్టిస్‌ ఎన్వీ రమణ అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన మాజీ సీజేఐకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు.

దక్షిణ భారతదేశంలో సరస్వతి దేవాలయాల్లో ప్రముఖమైంది నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయం. గోదావరి నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయంలో ఏటా వసంత పంచమి రోజున భక్తులు ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు. సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ సరస్వతీ దేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది. పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనురాలై ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆమెకు తొలిపూజలందిస్తారు.

సరస్వతి దేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే ఆ తల్లి ఆశీస్సులతో పిల్లలకు మంచి విద్యాబుద్దులు కలుగుతాయని తల్లిదండ్రులు భావిస్తారు. ఇందులో భాగంగానే బాసర జ్ఞానసరస్వతి ఆలయానికి పిల్లలను తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయిస్తారు.

ANN TOP 10