అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెట్టారు. ఈ నిఘాల్లో ఇప్పటికే బంగారం, మద్యం, వెండి ఆభరణాలతో పాటు భారీగా నగదు పట్టుబడింది. తాజాగా హైదరాబాద్ నగరంలో అధికారులు అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మియాపూర్ వద్ద భారీగా బంగారం, వెండి పట్టుబడింది. 27 కిలోల బంగారం, 15 కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. బంగారం, వెండిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా మరో వాహనంలో రూ.14 లక్షల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
కాగా..ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు, రవాణా శాఖ, కమిర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ వంటి శాఖలు నిర్వహిస్తున్న సోదాల ద్వారా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రి పట్టుబడుతున్నాయి.