టీడీపీ అధినేత చంద్రబాబును కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు 36 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. ఇదే సమయంలో అంగళ్లు..అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్.. ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు పైన కేసులు నమోదయ్యాయి. ఇక, తాజాగా అమరావతి అసైన్డ్ భూముల అవకతవకలకు సంబంధించి కేసు రీ ఓపెన్ చేసేందుకు సీఐడీ కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దీని పైన కోర్టు నోటీసులు జారీ చేసింది.
వరుస కేసులు టీడీపీ అధినేతకు సమస్యగా మారుతున్నాయి. 36 రోజులుగా స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు..బెయిల్ పిటీషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది. అదే విధంగా క్వాష్ కేసులోనూ సుప్రీంలో రేపు (మంగళవారం) విచారణకు రానుంది. ఇటు ఏపీ హైకోర్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2021లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గోల్ మాల్ జరిగిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేసారు. దీని పైన సీఐడీ విచారణ పూర్తి చేసింది. ఈ కేసు లో మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. విచారణ చేసిన న్యాయస్థానం నేడు తీర్పు ఇచ్చేందుకు సిద్దమైంది.
ఇదే సమయంలో సీఐడీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆధారాలు అందాయని చెబుతూ..ఈ కేసు విచారణకు వీలుగా రీ ఓపెన్ కు న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేసింది. కొత్త ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్ లో సీఐడీ కోరింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ కోర్టుకు ఆడియో ఆధారాలు అందచేసింది.