సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. సీఎం కేసీఆర్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నాయి. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని రేవంత్ రెడ్డి, ఓట్ల కోసం కేసీఆర్ కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల చెవుల్లో రోజా పూలు పెట్టే ప్రయత్నం అంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో మోచేతికి బెల్లం పెట్టినట్లు ఉందని విమర్శించారాయన.
మూడోసారి అధికారంలోకి రావడానికే..
మెదక్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పాల్గొన్నారు. బీజేపీ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుందని, సిద్ధాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి రావడం కోసమే సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా ఉందన్నారు రఘునందన్ రావు.
మద్యం ద్వారా ఆదాయం.. దేశంలో తెలంగాణ నెంబర్ 1
‘పెన్షన్‌దారులకు ప్రస్తుతం రూ.2వేలు ఉన్న పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతామని చెప్పడం. ఈ స్కీంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి తర్వాత రూ.3 వేలు చేస్తాం. ప్రతి ఏడాది రూ.500 పెంచుకుంటూ ఐదో సంవత్సరం నాటికి రూ.5 వేలు చేస్తామంటున్నారు. తెలంగాణ రాక ముందు మద్యం ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయం వచ్చేది. కిరాణ షాపులో ఉప్పు పప్పు అమ్మే విధంగా బెల్ట్ షాపులను పెట్టి మద్యాన్ని అమ్మిస్తున్నారు. దాంతో పదేళ్లలో 40వేల కోట్లకు ఆదాయం పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో దేశంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారని రఘునందన్‌రావు మండిపడ్డారు.