తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ.. రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఓవైపు 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ ఆశించి.. రాదని ముందే ఓ అంచనాకు వచ్చిన తెలంగాణ తొలి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. అయితే పొన్నాల లక్ష్మయ్య త్వరలోనే అధికార బీఆర్ఎస్‌లో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు.. పొన్నాల లక్ష్మయ్య పంపించారు. ఈ సందర్బంగా తన గోడును వెళ్లబోసుకున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు కూడా తన రాజీనామా విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తారని తెలుస్తోంది.