బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. తన ప్రస్తుత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు, కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ లోనూ బరిలో దిగుతానని ప్రకటించారు. హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో కార్యకర్తలే అన్నీ నడిపించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ లాగా తాను కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని, రెండింట్లోనూ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈటల ప్రకటనపై బీజేపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
