తెలంగాణ సీఎం కేసీఆర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేసీఆర్‌కు వైరల్ ఫీవర్ వచ్చిందని స్వయానా ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్.. తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే.. ప్రగతి భవన్‌లోనే కేసీఆర్‌కు వైద్య బృందం చికిత్స అందించింది. కాగా.. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు కనిపించక సుమారు 24 రోజులైంది.
కాగా.. కేసీఆర్ జబర్ధస్త్ ఉన్నారని.. పులి రేపో మాపో బయటకు వస్తుంది.. అంటూ బహిరంగ సభల్లో కేటీఆర్, హరీశ్ రావు చెప్తూ వస్తున్నారు. కానీ.. ఆయన మాత్రం కనిపించలేదు. అయితే.. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని.. రెండు రోజులుగా మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీలు కూడా నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఎన్నికల కసరత్తుపై మంత్రులకు దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిపై సమగ్ర సమాచారంతో పాలమూరు ప్రగతి నివేదిక పేరుతో పుస్తకాన్ని ముద్రించగా.. దాన్ని కేసీఆర్‌కు అందించారు. ఈ క్రమంలో.. సీఎం కేసీఆర్‌తో మంత్రి ఫొటో దిగారు. ఆ ఫొటోను తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్టు చేశారు. దీంతో.. అనారోగ్యంగా ఉన్నారని తెలిసిన తర్వాత తొలిసారి ఆయన ఫొటో కనిపించటంతో.. అందరూ హమ్మయ్యా మొత్తానికి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకుని 24 రోజుల తర్వాత జనాలకు కనిపించారని కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 15 నుంచి కేసీఆర్ ఎన్నికల కదనరంగంలో అడుగు పెట్టనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫాంలు ఇస్తారు. అందరికీ దిశానిర్దేశం చేస్తారు. అనంతరం.. హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల రణరంగానికి శంఖారావం పూరించనున్నారు. కాగా.. ఈ ఫోటో చూస్తుంటే.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి పూర్తిగా కోలుకున్నట్టే కనిపిస్తోంది.