AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇజ్రాయెల్‌లోని తెలంగాణ వాసులతో మాట్లాడిన బండి సంజయ్.. యోగ క్షేమాలపై ఆరా..!

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం నేపథ్యంలో.. పొట్టకూటి కోసం ఇజ్రాయెల్‌ వెళ్లిన కరీంనగర్ వాసులతో బీజేపీ ఎంపీ బండి సంజయ్ వీడియో కాల్‌లో మాట్లాడారు. వారి యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తామంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు. హమాస్ ఉగ్రవాదులు బాంబు దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం బంకర్లలో ఆవాసాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఇండియా అని పేరు చెబితే.. ఇక్కడ చాలా మంది మోదీ మోదీ అంటున్నారని.. భారత్ విశ్వగురువు అయ్యిందని ఇజ్రాయెల్‌లోని కరీంనగర్ వాసులు తెలిపారు. యుద్ధం పరిస్థితుల్లో శాంతి నెలకొల్పేందుకు ప్రధాని రంగంలోకి దిగితే స్వాగతిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని చెబుతున్నారని వారు తెలిపారు.

ఇక్కడి తెలంగాణ అసోసియేష్ అన్ని సదుపాయాలు కల్పిస్తోందని ఇజ్రాయెల్‌లోని కరీంనగర్ వాసులు తెలిపారు. సైరన్ మోగినప్పుడు వెంటనే బంకర్లలోకి వెళ్లాల్సి ఉంటుందని వారు తెలిపారు. బండి సంజయ్‌తో ఇజ్రాయెల్ నుంచి వీడియో కాల్‌ మాట్లాడిన వారిలో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్‌కు చెందిన యువకులు ఉన్నారు. వీరంతా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మరింత అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఎవరు ఫోన్ చేసినా తమకు సమాచారం ఇవ్వాలని ప్రధాని మోదీ తమకు సూచించారని ఈ సందర్భంగా సంజయ్ వారికి తెలిపారు. ప్రధాని మోదీ మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని ఇజ్రాయెల్‌లోని కరీంనగర్ వాసులకు సంజయ్ సూచించారు.

ANN TOP 10