తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. కేసీఆర్ తన కుటుంబం కోసమే పాలన సాగిస్తున్నారని అమిత్ షా ఆదిలాబాద్ సభలో మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె కవితను కాపాడేది బీజేపీ ప్రభుత్వం కాదా ?అని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో వైసీపీ, బీజేపీ, బీఆర్ఎస్ రాజీ ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. తర్వాతనే ఈ మూడు పార్టీలు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని నారాయణ ఆరోపించారు. కుట్రలో భాగంగానే మనీశ్ సిసోదియాను జైల్లో పెట్టారని ఆరోపించారు. అందరూ కలిసి కుమ్మక్కై కేవలం సిసోదియాను మాత్రమే ఇరికించారన్నారు. సత్యం రామలింగరాజు మీద సెబీ ఎంక్వెయిరీ వేశారని.. మరి అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని నారాయణ ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని దుయ్యబట్టారు.