రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజలు కోరుకునే మార్పు బీజేపీతోనే సాధ్యం అవుతుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కిషన్‌రెడ్డి నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో నిశబ్ద విప్లవం రాబోతుంది. రాష్ట్రంలోని అవినీతి, కుటుంబ పాలనను తుడిచి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలి. తెలంగాణలో సకలజనుల పాలన రావాలి. అది బీజేపీతోనే సాధ్యం అవుతుంది. ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడాలి. ఉద్యమకారులను కాంగ్రెస్ గౌరవించలేదు. ఉద్యమ ద్రోహులంతా ప్రగతి భవన్ లో ఉన్నారు. అధికారాన్ని, డబ్బును ఉపయోగించి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారు. తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
