ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం..
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయానికిగానూ కాంగ్రెస్ శ్రేణులు ఐకమత్యం, సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయడం చాలా ముఖ్యమని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అయిదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన వేళ.. ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఖర్గే ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సమర్థమైన వ్యూహం అవసరమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వారి జనాభాకు అనుగుణంగా సామాజిక న్యాయం, హక్కులు కల్పించేందుకు దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలన్న డిమాండ్‌ను ఖర్గే మరోసారి వినిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ఇది కీలకమన్నారు. కానీ, దీనిపై బీజేపీ మౌనంగా ఉందని విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి రాగానే మహిళా రిజర్వేషన్లను వీలైనంత త్వరగా అమలు చేయడంతోపాటు అందులో ఓబీసీ మహిళలకూ అవకాశం కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. మణిపుర్‌ను విస్మరించి, త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరచూ పర్యటిస్తున్నారని ఆరోపించారు.
