AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుకు హైకోర్టులో షాక్.. మూడు బెయిల్ పిటిషన్‌లు డిస్మిస్

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నందున పిటిషన్లను రద్దు చేశారు. తీర్పునకు సంబంధించిన పూర్తి సారాంశం రావాల్సి ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి.

ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, రహదారుల ఎలైన్‌మెంట్‌ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ గతేడాది మే 9న కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అలాగే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా అంగళ్లు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ చంద్రబాబు ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళుతున్న సమయంలో జరిగిన గొడవల్లో చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మూడు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై సోమవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీపై న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. అలాగే సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్‌పై కూడా ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సుప్రీం కోర్టు నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడైనా ఊరట లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10