హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ ఇజ్రాయెల్‌తోపాటు గాజాలో వందలాదిమంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. పదులకొద్ది మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు రేర్ అడ్మిరల్ డానియెల్ హగారీ తాజాగా వెల్లడించారు. అయితే, ఈ సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. వంద మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను హమాస్ ఉగ్రవాదులు అపహరించినట్లు టెల్ అవీవ్ ఇప్పటికే తెలిపింది. మొత్తానికి ఇరువైపులా మరణాల సంఖ్య 600 దాటినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భారత్ నుంచి అక్కడికి రాకపోకలు సాగించే విమానాలను వారంపాటు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ‘ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా.. టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాలను అక్టోబరు 14 వరకు నిలిపివేస్తున్నాం’ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తేదీల్లో టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని పేర్కొంది. శనివారం సైతం టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇదిలా ఉండగా.. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడుల నుంచి తిరిగి తేరుకుని ఇజ్రాయెల్.. పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది.
