సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామ శివార్లలో వందకుపైగా కోతుల కళేబరాలను గుర్తించారు. శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులకు.. చనిపోయిన కోతులు ఓ చోట కుప్పగా కనిపించాయి. దీంతో వారు వెంటనే వెటర్నరీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న వెటర్నరీ అధికారులు వాటి నుంచి శాంపిళ్లను సేకరించారు.
కోతులు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో మునిగడప గ్రామస్థులు షాకయ్యారు. విష ప్రయోగం చేసి ఈ కోతులను చంపి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అవి తాగిన నీటిలో పురుగుమందు కలిపి ఉంటారని అనుమానిస్తున్నారు. కోతులు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పడేసి పోయి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కోతుల బెడదతో విసిగిపోయిన కొందరు విష ప్రయోగం ద్వారా వాటిని చంపేసి.. మునిగడప శివార్లలో పడేసి ఉంటారనే భావన గ్రామస్థుల్లో వ్యక్తం అవుతోంది. సాక్షాత్తూ సీఎం సొంత నియోజకవర్గంలో కోతులు ఇలా అనుమానస్పద రీతిలో చనిపోవడాన్ని బట్టి.. రాష్ట్రంలో కోతుల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి, కోతుల బెడదకు ఓ పరిష్కారం చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.