AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియాకు భారీ షాక్.. పరుగుల వీరుడు దూరం..

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. వన్డే ప్రపంచకప్ లో టీమిండియా తన టైటిల్ వేటను కాసేపట్లో ప్రారంభించనుంది. ఆరంభ పోరులో ఐదు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా తో అమీతుమీ తేల్చుకోనుంది. సమవుజ్జీల మధ్య మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. అయితే, టీమిండియాకు భారీ షాక్ తగిలింది. డెంగీతో బాధపడుతున్న గిల్.. ఇంకా కోలుకోకపోవడంతో మ్యాచుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా చోటు దక్కించుకున్నాడు.

చెన్నై చెపాక్ స్టేడియం చాలా పొడిగా ఉంది. మ్యాచ్ జరిగే కొద్ది బంతి చాలా స్లోగా వచ్చే అవకాశం ఉంది. దీంతో స్పిన్నర్లు ఈ మ్యాచులో కీలకం కానున్నారు. రెండు జట్లలో మంచి స్పిన్నర్లు ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

36 ఏళ్ల తర్వాత చెన్నై వేదికగా ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య పోరు జరగనుంది. చివరిసారిగా 1987 ప్రపంచకప్‌లో చెన్నైలో ఇరు జట్లు తలపడగా.. టీమ్ ఇండియా కేవలం 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు భారత్‌కు లెక్క సరిచేసే అవకాశం ఉంది. 36 ఏళ్ల క్రితం ఎదురైన పరాజయానికి ఇప్పుడు సమాధానం చెప్పే అవకాశం ఉంది.

ఇక.. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే ప్రపంచకప్ లో టీమిండియా చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం రెండు వన్డే ప్రపంచకప్ లు జరిగినా భారత్ మాత్రం మరోసారి విశ్వవిజేతగా నిలవలేకపోయింది. సరిగ్గా 12 ఏళ్ల అనంతరం మరోసారి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగుతుంది. అయితే ఈసారి భారత్ వేదికగా మాత్రమే వన్డే ప్రపంచకప్ జరుగుతుంది.

మరోవైపు.. ఆస్ట్రేలియా, భారత్ ఇరు జట్లు కూడా బలంగా ఉన్నాయి. బ్యాటింగ్, పేస్ బౌలింగ్ లలో ఇరు జట్లు కూడా సమానంగా ఉన్నాయి. అయితే స్పిన్ లో మాత్రం ఆసీస్ కంటే కూడా భారతే బలంగా ఉంది. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఒకే ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ ఉన్నాడు. ఆడం జంపా మినహా మరో రెగ్యులర్ స్పిన్నర్ ఆ జట్టులో లేడు. అయితే గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్నస్ లబుషేన్ ల రూపంలో ఇద్దరు పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఉన్నారు. అయితే ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. జట్టులో ప్రతి ఒక్కరు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా వామప్ మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

తుది జట్లు :

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10