AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరల్డ్ కప్: దక్షిణాఫ్రికాపై పోరాడి ఓడిన శ్రీలంక

దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యం 429 పరుగులు… అయినప్పటికీ శ్రీలంక వెనుకంజ వేయకుండా చివరి వికెట్ వరకు పోరాడి ఓడింది. వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఢిల్లీలో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల వర్షం కురిసింది. ఈ పోరులో ఇరుజట్లు కలిసి మొత్తం 754 పరుగులు చేయడం విశేషం.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగులు చేయగా, శ్రీలంక ఛేదనలో 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. 102 పరుగుల మార్జిన్ తో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

లంక జట్టులో ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక (0), కుశాల్ పెరీరా (7) స్వల్ప స్కోర్లకే అవుటైనా… కుశాల్ మెండిస్ సంచలన ఇన్నింగ్స్ తో ఆశలు రేకెత్తించాడు. మెండిస్ 42 బంతుల్లో 76 పరుగులు సాధించడం విశేషం. మెండిస్ స్కోరులో 4 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయంటే అతడి దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత చరిత్ అసలంక కూడా తన వంతు పోరాటం చేశాడు. అసలంక 65 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 79 పరుగులు నమోదు చేశాడు.

భారీ లక్ష్యఛేదనలో లంకేయులు దూకుడు కొనసాగించినప్పటికీ, భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యారు. కీలక దశలో వికెట్లు కోల్పోవడం ప్రతికూలంగా పరిణమించింది. కెప్టెన్ దసున్ షనక సైతం పోరాట స్ఫూర్తి కనబర్చాడు. షనక 62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు సాధించాడు. బౌలర్ కసున రజిత 31 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అయితే, లక్ష్యం మరీ భారీగా ఉండడంతో లంకేయుల శక్తికి మించిన పనైంది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయిట్జీ 3 వికెట్లు పడగొట్టగా, మార్కో యాన్సెన్ 2, కగిసో రబాడా 2, కేశవ్ మహరాజ్ 2, లుంగీ ఎంగిడి 1 వికెట్ తీశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10