భద్రాచలంలో విధినిర్వహణకు వచ్చిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ నాలాలో పడి మృతి చెందిన ఘటన పోలీసు వర్గాల్లో విషాదం నింపింది. కొత్తగూడెం పీఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీదేవి, విధి నిర్వహణ నిమిత్తం భద్రాచలం వచ్చారు. డ్యూటీ ముగిసిన అనంతరం భద్రాచలం ఆలయంలోని శ్రీరాముడ్ని దర్శించుకుని, అక్కడి అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే, భద్రాచలంలో కురిసిన భారీ వర్షానికి అన్నదాన సత్రం వద్ద నాలా ఉప్పొంగింది. హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి అటుగా వెళుతుండగా, ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయారు. మహిళా పోలీసు నాలాలో పడిపోయారన్న సమాచారంతో ఇతర పోలీసులు స్పందించి, గాలింపు చర్యలు చేపట్టారు. అన్నదాన సత్రానికి సమీపంలోని ఓ కాలువలో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
