ఢిల్లీలో తాను ఎక్కడున్నదీ నారా లోకేశ్ స్పష్టం చేసిన నేపథ్యంలో, ఏపీ సీఐడీ అధికారులు ఈ మధ్యాహ్నం ఆయనకు నోటీసులు ఇచ్చారు. తొలుత వాట్సాప్ లో నోటీసులు పంపిన సీఐడీ అధికారులు, ఆ తర్వాత లోకేశ్ తాను ఎక్కడున్నదీ చెప్పడంతో గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందినట్టు లోకేశ్ సీఐడీ అధికారులకు బదులిచ్చారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఈ నోటీసులు పంపారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదైంది. ఇటీవలే ఈ కేసులో ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చడం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా, తాము 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ చెప్పడంతో హైకోర్టు లోకేశ్ బెయిల్ పిటిషన్ విచారణను ముగించింది.