రూ.2,000 నోట్ల (Rs.2000 notes) మార్పిడి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా ప్రకటన చేసింది. రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు ఈనెల 30వ తేదీన ముగియనుండటంతో గడువును మరింత పొడిగిస్తున్నట్టు ఆర్బీఐ శనివారంనాడు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 2023 అక్టోబర్ 7వ తేదీ వరకూ గడువును పొడిగిస్తున్నట్టు ఒక నోటిఫికేషన్‌లో ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకూ గడువు తేదీని ఉపయోగించుకోని వారు తమదగ్గరున్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడం, డిపాజిట్ చేయడం ద్వారా తాజా గడువును ఉపయోగించుకోవాలని కోరింది.
కాగా, మే 19వ తేదీ వరకూ చలామణిలో ఉన్న 93 శాతం రూ.2,000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్టు ఆర్జీబీ గత సెప్టెంబర్ 1న తెలిపింది. ఆగస్టు 31 వరకూ రూ.3.32 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు బ్యాంకులకు చేరినట్టు తమకు సమాచారం అందిందని పేర్కొంది.