AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎవరినో కుక్క కరిస్తే.. నేనే కరవమన్నట్లు చేశారు

హైదరాబాద్: అంబర్‌పేట లో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలుడి మృతిపై జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన వెంటనే జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు , ఉన్నతాధికారులతో మేయర్ విజయలక్ష్మి  సమీక్ష చేశారు. బాలుడి మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. బాలుడిని చంపిన కుక్కలకు ప్రతిరోజూ ఓ మహిళ మాంసం పెడుతుండేదని, ఆమె 2 రోజులుగా కనిపించకపోవడంతో ఆకలితో కుక్కలు దాడి చేసి ఉండొచ్చంటూ ఆమె సందేహం వెలిబుచ్చారు. దీంతో మేయర్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. ఇప్పటికీ జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరుపై మేయర్ వ్యాఖ్యల దుమారం రేగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మేయర్ విజయలక్ష్మి వస్తున్న విమర్శలపై స్పందించారు. జీహెచ్‌ఎంసీ  మేయర్‌గా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు. హైదరాబాద్‌ లో ఎవరినో కుక్క కరిస్తే.. తానే కరవమన్నట్లు చేశారని వ్యాఖ్యానించారు. కొందరు కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మేయర్ మండిపడ్డారు. రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ బ్యాడ్‌గా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌‌కు చాలాసార్లు చెప్పానని విజయలక్ష్మి తెలిపారు.

అంబర్‌పేటలో బాలుడిపై కుక్కలు మూక్కుమ్మడిగా దాడి చేస్తున్న దృశ్యాలు చూసి ప్రతీ ఒక్కరూ కంటతడిపెట్టారు. ఈ క్రమంలో వీధికుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం  సీరియస్‌గా తీసుకుంది. వీధి కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గైడ్ లైన్స్  జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించింది. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని… కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్  చేయాలని పేర్కొంది. మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్యను పెంచాలని తెలిపింది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని… అలాగే వీధి కుక్కలపై స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేయాలని చెబుతూ.. జీహెచ్ఎంసీ, సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ANN TOP 10