సినీ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మరోసారి కేసీఆర్ సర్కార్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటేసిన పాపానికి సీఎం కేసీఆర్ మహిళలకు మరణశిక్ష వేస్తున్నాడని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా..ఈరోజు నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ కు మందు మీద ఉన్న దృష్టి ఆడబిడ్డలకు న్యాయం చేసే విషయంలో లేదని ఆమె ఆరోపించారు. ఢల్లీి లిక్కర్ స్కాంలో కవిత ఎక్కడ అరెస్ట్ అవుతుందో అన్న భయం కేసీఆర్ కు పట్టుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నా పట్టించుకోని కేసీఆర్ లిక్కర్ స్కాంలో సిసోడియా అరెస్ట్ పై స్పందించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలోని మహిళలకు ఏమి జరిగినా పట్టించుకోని కేసీఆర్ తన కూతురు కవిత విషయానికి వచ్చే వరకు ఆందోళన చెందుతున్నారని విజయశాంతి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని మహిళలకు కేసీఆర్ కు పట్టదు కానీ తన కూతురు ఎక్కడ అరెస్ట్ అవుతుందో అనే భయంతోనే సిసోడియా అరెస్టుపై స్పందించారన్నారు. కాగా ఇటీవల తెలంగాణలో ఓ వైపు విద్యార్థుల ఆత్మహత్యలు..మరోవైపు మహిళలపై అత్యాచారాలు, హత్యలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో బండి సంజయ్ ఈ ఘటనలకు నిరసనగా.. సోమవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో దీక్షకు పూనుకున్నారు.