ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. శతాబ్దాల తర్వాత భైరందేవుడి నిజస్వరూపం సాక్షాత్కారమైంది. నిత్యసింధూరం తో నిండుగా కనిపించే మహా శివుడు వందల ఏళ్ల తర్వాత నిజ రూప దర్శనం ఇవ్వడంతో భక్తులు ఆలయానికి భారీ ఎత్తున క్యూ కట్టారు. అడవులజిల్లా ఆదిలాబాద్ లోని ఆదివాసీల కొంగు బంగారంగా కొలువ బడుతున్న కదిలే శివుడి మహత్యం ఇది.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సదల్ పూర్ లోని భైరందేవ్, మహాదేవ్ ఆలయాన్ని 11వ శత్తాబ్దంలో నిర్మించారు. ఇక్కడ కొలవై ఉన్న భైరందేవ్ దేవుడి నిజస్వరూపం ఉహించుకోవడమే తప్ప ఇన్నేళ్లల్లో నిజరూపాన్ని దర్శించుకున్న వాళ్లు లేరు. 11 వ శతాబ్దంలో శాతవాహునులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు సమాచారం. 9 శతాబ్దాల నుండి సింధూరంతో మాత్రమే దర్శనమిచ్చే మహాదేవుడి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ వచ్చారు. తాజాగా ఆ నిజరూప దర్శనం ఎట్టకేలకు లభించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.
మహాదేవ్ భైరందేవ్ ఆలయంలోని మూర్తికి భక్తులు ప్రతి ఏడాది జనవరి మాసంలో జరిగే జంగి జాతరలో చందనం పూతగా పూస్తారు. అలా శతాబ్దాల తరబడి చందనం రాయడంతో దేవుడి రూపం సింధూరమయవగా విగ్రహం తలపై భాగం దాదాపుగా మీటరు వరకు ఎత్తు పెరిగిపోయింది. తాజాగా బుధవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మీటరు పొడవైనా చందనం ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో భైరందేవ్ దేవుడి నిజస్వరూపం బయటపడింది. ఇది గమనించిన ఆలయ పూజారి స్థానిక కమిటీ సభ్యులకు తెలియ జేసారు. భైరందేవ్ నిజ రూపం సాక్షాత్కారం అయిందన్న సమాచారం మండలంలోని అన్ని గ్రామాలకు పాకడంతో చుట్టూ పక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి క్యూకట్టారు. నిజరూపాన్ని దర్శించుకుని ముగ్దులయ్యారు భక్తులు. త్వరలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భైరందేవ్ దేవునికి అభిషేకం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.