– కనువిందుగా సాగిన ఖైరతాబాద్ బడా గణనాథుడి శోభాయాత్ర
– బాలాపూర్ గణనాథుడూ హుస్సేన్‌సాగర్ వైపు పయనం
– నగరమంతా గణనాథుల నిమజ్జనాలతో కోలాహలం
– భక్తకోటితో నిండిపోయిన ట్యాంక్‌బండ్ పరిసరాలు
– లంబోదరుడి నామస్మరణతో మారుమోగిన నగరం
ఈ ఏడాది దశ మహా విద్యా గణపతిగా భక్తకోటికి దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. భక్తజన కోలాహలం మధ్య శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన గణనాథుడి నిమజ్జనం పూర్తమయింది. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడిని నిర్వాహకులు నిమజ్జనం చేశారు. గురువారం ఉదయం 6 గంటలకే మొదలైన గణేశ్ శోభాయాత్ర.. భక్తుల కోలాహల మధ్య సందడిగా కొనసాగింది.
మరోవైపు బాలాపూర్ గణపతి శోభాయాత్ర కూడా హుస్సేన్‌సాగర్ వైపు కొనసాగుతోంది. నగరవ్యాప్తంగా వస్తున్న బొజ్జ గణపయ్యల విగ్రహాలతో ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్డు భక్తకోటితో కిటకిటలాడుతోంది. నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ‘గణపతి బప్పా మోరియా’.. జై బోలో గణేశ్ మహరాజ్ కీ.. జై..’ వంటి నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి.