ఏపీలో రానున్న రోజుల్లో గేరు మార్చాలని వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జగన్ సమావేశం అయ్యారు. ఏపీలో రానున్న రోజుల్లో రెండు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
ఈ నెల 29న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. 30వ తేదీ నుంచి నేతలంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి పేరిట మరో కార్యక్రమాన్ని పార్టీ పరంగా చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామంలో వాలంటీర్లు, పార్టీ నేతలు ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు జగన్.
రానున్న రెండు నెలల్లో ఈ రెండు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించాలన్నారు జగన్. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూనే అదనంగా రెండు కార్యక్రమాలు చేపట్టాలని జగన్ ఆదేశించారు.
పనితీరు, సర్వేల ఆధారంగానే టికెట్లు..
పార్టీ నేతలతో సమావేశంలో జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ” రానున్న 6 నెలల్లో ఏం చేస్తారనేది ముఖ్యం. నేతల మధ్య విబేధాలు పరిష్కరించుకోవాలి. బహుశా అందరికీ టికెట్లు రావచ్చు. కొంతమందికి నేను టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. ప్రజల్లో మీరున్న పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు ఉంటాయి. కానీ అందరికీ చెప్పేది ఒక్కటే.
టికెట్ రాకపోతే ఎవరూ బాధపడొద్దు. టికెట్ ఇవ్వకపోతే ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడు అని దయచేసి అనుకోవద్దు. టికెట్ రాని వాళ్లకు మరో విధంగా అవకాశం ఇస్తాం. టికెట్ ఇస్తే అదొక ప్రత్యేక బాధ్యత. టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పుడూ నా వాళ్లే. అది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. జట్టు ఉంటే ముడి వేసుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి. టికెట్లు ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరు నా నిర్ణయాలకు పెద్ద మనసుతో సహకరించాలి. టికెట్ అనేది పూర్తిగా పనితీరు, సర్వేల ప్రాతిపతికన కేటాయిస్తాం. వైసీపీ గెలుస్తుందనే మిగతా పార్టీలు కలిసి వస్తున్నాయి. రానున్న 2 నెలలు ప్రజల్లో ఉండాలి” అని నేతలకు సూచించారు జగన్.