గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురించి మంత్రి కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడుతూ..‘‘మహిళ గవర్నర్ అని కూడా చూడకుండా కేటీఆర్ అలా మాట్లాడం వారి దొరతనానికి నిదర్శనం. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఫిట్ – రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ ఫిట్. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వానికి అవేవీ కనిపించడం లేదు. 140 కోట్ల ప్రజల గొంతుకగా ఉన్న మోదీని అనర్హుడని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడమంటే, వారి నరనరాల్లో బడుగు బలహీనర్గాలపై ఎంత అక్కసు ఉందో రాష్ట్ర ప్రజలు గమనించాలి’’ అని డీకే అరుణ పేర్కొన్నారు.
