హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో ఓ భారీ చోరీ జరిగింది. బండ్లగూడ అశోక్ విహార్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ బిల్డర్ ఇంట్లొ ఈ దొంగతనం చోటు చేసుకుంది. ఇంట్లో దాచి ఉంచిన రూ. కోటి నగదుతో పాటు 70 తులాల బంగారం అపహరణకు గురైంది. ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇంట్లో పని చేసే పని మనిషిపై యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పి రెండ్రోజుల క్రితం ఆమె ఊరికి వెళ్లినట్లు చెప్పారు.
అప్పటి నుంచే ఇంట్లో ఉన్న బంగారం మాయమైందని ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు, క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. చోరీకి పాల్పడింది ఇంటి పని మనిషా? లేక బయటి నుంచి వచ్చిన దొంగలా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొని సొత్తు రికవరీ చేస్తామని తెలిపారు.