తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని పేర్కొంది. హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని వెల్లడించింది.
అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని తెలిపింది. సోమవారం, మంగళవారాల్లో వివిధ జిల్లాల్లో నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్ధిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
మరోవైపు దేశంలోని పల రాష్ట్రాల్లో సెప్టెంబర్ 27 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, తమిళనాడు, కోస్తాంధ్ర, కర్ణాటక, ఏపీలోని రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రాగల 48 గంటలపాటు బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారత్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 48 గంటల తర్వాత తగ్గుముఖం పడతాయని చెప్పింది. అండమాన్, నికోబార్ దీవుల్లోనూ బుధవారం వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.