తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ లపై షాక్ లు తగులుతున్నాయి.. ఇప్పటికే హైకోర్టు ష్క్వాష్ పిటిషన్ కొట్టేయడం.. తరువాత సీఐడీ కస్టడీకి ఇవ్వడంతో.. టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతునన్నాయి. అయితే తాజాగా రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసిందని అనుకునే లోపే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇంకో షాక్ తగిలింది. మరో 11 రోజుల పాటు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ పొడిగించారు. ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. అయితే ఈ సందర్భంగా న్యాయ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే అంతా అయిపోయిందని మీరు భావించాల్సిన అవసరం లేదని చంద్రబాబుతో జడ్జి చెప్పారు. మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని చంద్రబాబుతో చెప్పిన న్యాయమూర్తి. విచారణ ప్రక్రియ ఇంకా చేయాల్సి ఉందన్నారు.
కస్టడీలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి చంద్రబాబును ప్రశ్నించగా.. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఆయన సమాధానమిచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించారా అని అడిగిన ప్రశ్నకు.. నిర్వహించారని చంద్రబాబు బదులిచ్చారు. బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. సోమవారం బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
సీఐడీ రిమాండ్ పొడిగింపు పిటిషన్‌పై ఆదేశాల సమయంలో చంద్రబాబుకు చెందిన లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా అని.. ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుందన్నారు.
ఆదివారం సాయంత్రం సీఐడీ కస్టడీ పూర్తి కాగానే ఏసీబీ కోర్టు జడ్జి ముందు చంద్రబాబును వర్చువల్‌గా జైలు అధికారులు హాజరుపరిచారు. చంద్రబాబు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. సీఐడీ న్యాయవాదులు కస్టడీ కోరుతూ మెమో దాఖలు చేయడంపై చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇవాళ్టితో రిమాండ్ ముగియడంతో చంద్రబాబు రిమాండ్‌ను మరో 11 రోజుల పాటు పొడిగిస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు వెల్లడించింది.