అన్ని దానాల్లో అవయవదానం గొప్పది.. తాను పోతూ కూడా మిగతావారిలో బతికుండటమే ఈ అవయవదానం గొప్పతనం. ఇలాంటి సత్కార్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఈ విలువైన అవయవదానంలో రెండో స్థానంలో నిలచింది తెలంగాణ. అవయవదాన ప్రాముఖ్యతపై ప్రజలకు తెలంగాణ సర్కారు కల్పిస్తున్న అవగాహన స్పలితాలిస్తోంది. అవయవదానం, టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అత్యుత్తమ సేవల అందిస్తూ.. ఎన్నో ప్రాణాలను నిలుపుతోంది. అవయవాదానంలో.. రాష్ర్టాల జాబితాలో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా.. తెలంగాణలో రెండో స్థానంలో నిలవటం విశేషం. తమిళనాడులో నిర్వహించిన అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత ఈ అవార్డును అందుకున్నారు.
డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం.. 5 లక్షల మంది అవయవాలు ఫెయిలై చనిపోతున్నారు. అయితే… ఇలాంటి వారి ప్రాణాలు నిలబెట్టాలంటే.. అవసరమైన అవయవ మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 2012లో రాష్ట్ర సర్కార్ “జీవన్‌ధాన్” పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. అవయవదానం ప్రాముఖ్యత, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు కృషి చేసింది.
ప్రభుత్వ కృషితో.. అవయవదానంపై ప్రజల్లో అవగాహన ఏర్పడింది. జనాల నుంచి వచ్చిన ఆదరణతో.. తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలిచింది. దీన్ని గుర్తించిన కేంద్రం సర్కారు.. గతంలో ఢిల్లీలో జరిగిన అవయవదాన దినోత్సవంలో రాష్ర్టానికి ఉత్తమ అవార్డు అందజేసింది. జీవన్‌దాన్ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు 2015లో స్కోచ్ అవార్డు కూడా రావటం గమనార్హం. కాగా.. ఇప్పుడు దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవటం విశేషం.
అయితే.. గత 9 నెలల్లో తెలంగాణలో 160 ఆర్గాన్ డొనేషన్స్ జరిగాయి. ఈ ఏడాది ముగిసే సమయానికి.. ఆ సంఖ్య 200 దాటనుండటం ఖాయంగా కనిపిస్తోంది. 2022లో 194 డొనేషన్స్ జరిగాయి. 2023 సెప్టెంబర్ నాటికి 160 డొనేషన్లు జరగ్గా.. సుమారు 400కు పైగా ట్రాన్స్‌ప్లాంటేషన్స్ జరిగాయి. రెండేండ్లలో దాదాపు 1100 మంది ప్రాణాలను నిలబెట్టటం విశేషమని.. జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత చెప్పుకొచ్చారు.