ఆరు పథకాలపై మహిళల మొగ్గు
బీఆర్‌ఎస్‌లో కలవరం
కొత్త పథకాల రూపకల్పన దిశగా గులాబీ దళపతి
కాంగ్రెస్ జోరు చూసి బీఆర్‌ఎస్ భయపడుతోందా?.. ఆరు గ్యారెంటీ పథకాలు కలవరం రేపుతున్నాయా .. అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.. ఇందుకు ప్రధాన కారణం కొత్త పథకాల రూపకల్పనలో గులాబీ దళపతి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతుండటమే. ఇప్పటికే కాంగ్రెస్ తన 6 గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఈ పథకాలపై ఓటర్లు సైతం ఆకర్షితులవుతున్నారు. అందుకే బీఆర్‌ఎస్ కూడా కొత్త పథకాలతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో బీసీలు ఎక్కువ కనుక వారిని ఆకట్టుకునేలా కొత్త పథకాల్ని రూపొందించడంతోపాటూ.. మహిళల్ని సైతం దృష్టిలో పెట్టుకొని అదిరిపోయే పథకాల్ని మేనిఫెస్టోలో చేర్చాలని బీఆర్‌ఎస్ రెడీ అవుతున్నట్లు సమాచారం.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన అన్ని పథకాలనూ… అధికారంలోకి వచ్చిన తొలి రోజే ప్రారంభించేసింది. దాంతో అక్కడి ప్రజలు ఖుషీ అయిపోయారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఆరు పథకాలనూ అమలుచేస్తామని రాహుల్ గాంధీ ఇప్పటకే ప్రకటించారు. అందువల్ల ప్రజల్లో ఈ స్కీములపై నమ్మకం బాగా పెరిగింది. ఇది బీఆర్‌ఎస్‌కి సమస్యగా మారినట్లు పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
ఉన్న పథకాలతోపాటూ… కొత్త పథకాలు ప్రకటించడం ద్వారా… ఉన్న ఓటర్లతోపాటూ… తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చు అనేది బీఆర్‌ఎస్ తాజా వ్యూహంగా తెలుస్తోంది. ఐతే.. ఉన్న పథకాలకే డబ్బు సరిపోవట్లేదు, మరి కొత్తవి ప్రకటిస్తే, వాటి అమలుకు మరిన్ని రూ. లక్షల కోట్ల అప్పులు చెయ్యాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం కాదు. మరి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేయనుందనేది పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు తెలుస్తుంది.